మానవాళి మనుగడలో ప్రముఖ పాత్ర ప్రకృతిది అని మనకందరికీ తెలిసిన విషయమే. ప్రకృతి పంచభూతాత్మకమైనది. (పృథివీ-ఆపః-తేజః-వాయుః-ఆకాశః ) అందునా ముఖ్యమైనది (తేజః) – అగ్ని. సనాతన ధర్మ పరిరక్షణ లో దిశా నిర్దేశం చేసే విస్తారమైన వేదాలు కూడా అగ్ని ప్రాముఖ్యతని ముక్త కంఠం తో నినదిస్తున్నాయి. అటువంటి అగ్నిని సమాజంలో ప్రతీ పౌరుడు (స్త్రీ – పురుష బేధం లేకుండా) సంరక్షించవలసిన అవశ్యం /ఆవశ్యకత ఎంతో వున్నది. ఇట్టి అగ్ని ప్రశస్త్యాన్ని ప్రస్తుత సమాజానికి వివరిస్తూ, చైతన్యవంతులను చేస్తూ మానవాళి కళ్యాణానికి పరిషత్ కృషిచేస్తున్నది. మనం చేసే పూజలలో లేదా ముఖ్య కార్యక్రమాలలో దీప ప్రజ్వలన తో మొదలుపెట్టి, మంగళ హారతి తో ముగించడం మనందరికీ తెలిసిన విషయమే . అంటే అగ్ని తో ప్రారంభించి అగ్ని తో ముగించడం. తద్వారా అగ్ని భగవానుడు సంతుష్టుడై , కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాంటి అగ్ని భగవానుడు ప్రతినిత్యం మనతో (మన ఇంటే ) వుంటే, ఆయన కృపతో మనం తలపెట్టే ప్రతీ కార్యం దిగ్విజయంగా పూర్తి చేయవచ్చని పరిషత్ ప్రగాఢంగా విశ్వసిస్తోంది !!! పవిత్రాగ్ని కి ఆ శక్తి వున్నదని వేదాలు కూడా బలంగా చెప్తున్నాయి.
పరిషత్ ‘సనాతనాగ్ని సంరక్షణం ‘ అనే కార్యక్రమం మొదటి విడతలో దైనందిన అగ్ని ఆరాధనన విధానాన్ని, వేదవిద్యార్థులను అగ్నికార్యము నకు కావలసిన పిడకల/సమిధలను అందిస్తూ ప్రోత్సహించడం . వీరు తదుపరి ఆశ్రమమైన గృహస్థాశ్రమ ప్రవేశ సమయానికి ఔపాసనాగ్ని సంరక్షణకు సిద్ధం అవుతారు. రెండవ విడత లో మొదలుగా సభ్యులైన గృహస్థాశ్రమవాసులకు అగ్ని సంరక్షణ కర్తవ్యాన్ని విస్తారం గా వివరించి మరియు వారి కార్యాచరణములకై తగు సహాయమును అందించుటకు పరిషత్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.